Monday, October 31, 2011




రోజులు గడిచిపోతున్నాయి జ్ఞాపకాలుగా మారి.... 
జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మధుర స్మృతులుగా మారి.... 
మధుర స్మృతులు అలరిస్తున్నాయి ఆనంద సంద్రాలుగా మారి... 
ఆనంద సంద్రాలు పొంగుతున్నాయి కోటిసరాగాలుగా మారి..
కోటిసరాగాలు వినిపిస్తున్నాయి వీనులవిందులుగా  మారి...
వీనులవిందులు చేరుతున్నాయి హృదయస్పందనలుగా మారి.. 
హృదయస్పందనలు కలవరిస్తున్నాయి నీ నామావళిగా మారి...



జల జల జారే జలపాతపు సవ్వడి లా...
అప్పుడే ఉదయిస్తున్న ప్రభాత సూర్యుని వెలుగులా..
ఎండిపోయిన నేలపై పడి ప్రాణాన్ని నింపే చినుకు రవ్వలా..
రణ గొన ధ్వనులతో రోదిస్తున్న బిడ్డకు జోలపాటలా..  
తుఫానులో దారి తప్పి సంచరిస్తున్న నావకు ఒడ్డుకు చేరే సహాయములా..
కనిపించి తలపించి అలరించే నీ నవ్వు చూస్తూ ఉండాలని ఉంది ఎల్లవేళలా...

Sunday, October 23, 2011

నీవాడను నేను....నీ కొరకు వేచిఉంటాను నేను...



 కలలే అలలై కలిసాయి నిన్నే
మదిలో మధువై మురిసాయి మరులే
ఎలా ఎలాగ అంటోంది మది
నిజమే జరిగేను అంటోంది నా ఎద
మరిచింది లేదు తలవంది లేదు ప్రతిక్షణం
పదునైన నీ చూపు ప్రియమైన నీ పిలుపును అనుక్షణం
ఏ నేలనున్నా ఏ పిలుపువిన్నా నీ నామమే
మమతల కొలువైన నీవే నా మనుగడకు మార్గం
  

నీ పిలుపు వినాలని నీ మోము దర్శించాలని ఆశ
గడియ గడియను నీ పాదాల చెంత ఉంచాలని ఉబలాటం
నా జీవన జ్యోతీ నా ఆశల ఆక్రుతీ
అనురాగపు ఆలయమా అర్చనలేని ఓ ఆదిశక్తీ......
నీవాడను నేను....నీ కొరకు వేచిఉంటాను నేను...
నా తుది శ్వాస వరకు....
                               ------ప్రభాకర రావు కోటపాటి

    

Sunday, March 27, 2011

వర్ణణాతీతం నా ఆనందం

వర్ణణాతీతం నా ఆనందం
ఆశ్చర్యభరితం నా చిత్తం
ప్రమోదసద్రుశం నా నేత్రద్వయం
పుష్పాలంక్రుతం నా హ్రుదయం

ఇన్ని భావనలు ఒక్కక్షణంలో
మిన్ను దాటాయి ఆమె రాకతో

ప్రకంపనలతో దేహం ద్రవించింది
మౌనగీతాలతో మనస్సు ఆలాపించింది
ఉల్లాసంతో ఊపిరి ఊగిపోయింది
ఆమె పలుకరింపుతో ప్రాణం లేచివచ్చింది

స్వర్గంలో ఉన్నానా అన్న ఆలోచనలు
మదిలో మల్లెల గుభాలింపులు
కళ్ళలో వెల్లువలా విద్యుత్తుకాంతులు
చెవులలో సెలయేరుల సవ్వడులు

చెలరేగాయి చేరువయ్యాయి
చలింపచేసాయి చైతన్యపరచాయి

కల నిజమైన ఆ మధురక్షణాలు
ఇల నిలిచిన ఆ దేవత దయా వీక్షణాలు
శిలపై లిఖించదగినవి ఆ సువర్ణాక్షరాలు
చెలి చెంతనిలిచిన ఆ అమ్రుత ఘడియలు
ఎలా మరువగలను! ఆమెను.... అది అసాద్యమేమో!



                      ------ప్రభాకర రావు కోటపాటి

Saturday, March 26, 2011

నీ స్నేహామ్రుతం నఖశిఖ పులకాంకితం



నీ స్నేహామ్రుతం నఖశిఖ పులకాంకితం

ఆనందవదనం అనుపమాన దేదీప్యం

కరుణరసపూరిత కనకదుర్గ స్వరూపం


అద్బుతదరహాస అధరద్వయం

విజయసారద్యసహిత విలక్షణ విగ్రహం

నిర్మల కార్యాచరణ నిస్వార్ద త్యాగశీలం


నిత్యప్రేరణశోభిత నిజనాయకత్వం

అనంతవిశాలక్షరచిత ఆలోచనాపర్వం

సకలజనులనుకాచే సేవాభావం


వీనులవిందైన వాక్కులప్రవాహం

భువనభోంతరాలునిండే భావసౌందర్యం

దయనువర్షించే దేవతామూర్తిత్వం


రమనీయతాధర రాజపూజ్యవ్యక్తిత్వం

గమ్యనిర్దేశిత గంగాభవాని స్వరూపం

చైతన్యప్రధాత నాకు అనుక్షణం



                      ------ప్రభాకర రావు కోటపాటి

Sunday, March 20, 2011


అయిపోయింది కాలచక్రంలో ఒకరోజు

గడిచిపోయాయి శ్రమక్రమములో కొన్నిగంటలు
కురిపిస్తోంది నిండుచందమామ పండువెన్నెలలు
కాంతులీనుతోంది నక్షత్రమండలం మిలమిలకాంతులతో
వేచిచూస్తుంది నీ కలలరాజ్యం నీ రాకకోసం
స్వాగతిస్తుంది విశ్రాంతి రాత్రి నిశబ్ద నిముషాలతో
కదిలిసాగుతుంది చల్లటిగాలి వింజామరలతో
సాగిపోయి సేదతీరు మిత్రమా ఆ ఆనంద నిద్రావస్థలో

                                                          --మాలతి





Monday, April 5, 2010

వీర పాండ్య కట్టబొమ్మ కరుత్తయ్య నాయకుడు


నిరంతర వేద నాద శోభితమై వీరాధి వీర వైరి కవోష్ట రుధిర ధారా సంసిక్త పునీతమై నిత్య సంతుస్టులు ధర్మవర్తనులైన వీరులకు ఆలవాలమై ధన కనక వస్తు అహార వజ్ర వైఢూర్యములకు నిలయమై లక్ష్మీ శోభిత పతివ్రతా నారీ శిరోమణులకు ఆశ్రయమై పవిత్ర నదీ నదాల ప్రవాహ వాహినులతో పునీతమై సస్యశ్యామల వ్రుక్ష జాతులకు జీవ సమూహాలకు ఆటపట్టు అయి స్వతంత్ర భావ ప్రపూరిత నాయకులచే పరిపాలించబడు ఈ పాంచాల కురుచ్చి రాజ్యాన్ని ఆ తుచ్చ ఆంగ్ల ముష్కరులకు సామంత రాజ్యముగా చేయుటయా?



అది చూసి సహించి నేను జీవించుటయా?


అసంభవం ఈ కరుత్తయ్య నాయకుడు అది జరుగనివ్వడు!


అప్రతిహత వీర పాంచాల సైనికులను అగ్నిహోత్రాలుగా మారుస్తాను అచంచల దీక్షాకంకణులై అనన్య అసామాన్య తేజో విరాజితులైన వీరులను తయారు చేస్తాను! ప్రళయకాల రుద్రస్వరూపులై శత్రుదుర్భేద్యమై ప్రభంజనభాసితమై విజ్రుంభించే సైన్యాన్ని నడిపిస్తాను! నా దేశ ప్రజలకోసం చివరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ విదేశీ విద్రోహులను పారద్రోలి వారికి స్వెచ్చా స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తాను!


ఒరేయి బానర్ మర్ వ్యాపారము పేరుతో మా దేశంలో ప్రవేశించి వెన్నుపోట్లతో అధికారాన్ని సంపాదిస్తున్న మీకు పోవుకాలము దాపురించినదిరా లేక ఆత్మాభినముతో జీవించు అఖండులైన అజేయులైన భారతీయ చక్రవర్తులను సామంతులుగా మార్చవలెనని ప్రయత్నించుదురా మతిలేక మందమతులై మమ్ములను బానిసలుగా మార్చ అలోచన చేస్తున్నారు కప్పము వసూలు చేయ యత్నిస్తున్నారు.


ఎందుకు కట్టాలిరా శిస్తు. ఈ పవిత్ర భారతదేశము కన్న ముద్దు బిడ్డలము మేము ఈ మట్టినుండి పుట్టిన అగ్నిహోత్రులం మేము ఈ దేశం మాది ఈ వ్రుక్ష సంపద మాది ఈ నదీ నదాలు మా సొంతం ఈ గాలి మాది ఈ నేల మాది ఈ ప్రక్రుతి సంపద మా సొత్తు ఓడలొ వలస వచ్చిన మీకెక్కడిదిరా ఈ హక్కు ఎందుకురా మీకీ దురహంకారం


నీతి న్యాయం దర్మం సత్యం త్యాగం అనే పంచభూతాలనుండి ఉద్భవించిన పవిత్ర జాతిరా ఇది అటువంటి మహోన్నత భరత జాతిని బానిసగా మార్చాలని ప్రయత్నిస్తున్నావా! మదపుటేనుగును పురికొసతో బంధించగలవా! ఫెల ఫెల లాడే అగ్గిపిడుగును సీసాలో దాచగలవా! ఉప్పొంగే ఉద్రుత ప్రవాహాన్ని మట్టికట్టలతో ఆపగలవా! తీక్షణ యుక్తమైన తుఫాను గాలిని తడికలతో నిలుపగలవా! పొరపడుతున్నావు! బ్రమపడుతున్నావు! అవివేకముతో తలగోకుకొనుచున్నావు!


ఈ ప్రపంచానికి నాగరికత భోధించిన దేశం నాది! కుటుంబ సంస్క్రుతిని తీర్చిదిద్దిన సమాజం ఇది త్యాగనిరతి నిస్వార్ద ప్రజా సేవ మూర్తీభవించిన నాయకులను కన్న భారతదేశం రా ఇది! ప్రపంచానికే విశ్వవిద్యాలము రా ఈ పవిత్ర భూమి! నమస్కరించదగిన మాత్రుమూర్తిని చెరపట్ట ప్రయత్నిస్తున్నారురా మీ మూర్ఖ అంగ్లేయులు! అది అసాద్యము అసంభవము అని గుర్తించలేక పోతున్నారు! రాజ్య కాంక్షతో రాజకీయపుటెత్తులతో ఈ దేశాన్ని రణరంగముగా చేస్తున్నారు! కానీ మీ నయ వంచన ఎక్కువకాలము సాగదు!


ఖండ ఖండాలలో అఖండ కీర్తి నార్జించిన నా భరత ప్రజలు మీ అక్రుత్యాలను ఎక్కువ కాలము సహించరు నందన వనం లాంటి ఈ సుందర దేశాన్ని మందు గుండు సామాగ్రితో నింపే మీకు తగిన శాస్తి జరుగుతుంది! నిరంతర నిర్మలమూర్తులైన దేశభక్తులు సాగించే విప్లవాగ్ని కీలలలో మీ అయుధాలు మాడి మసై పోగలవు! అన్యాయము అమానుషము అత్యాచారములతో రాజ్యమేలుతున్న మీరు మా భరతసిమ్హాలకు ఆహారము అవుతారు! నీడ నిచ్చిన చెట్టును నరికి వేయాలనుకొనే మీ కాల్లు చేతులు విరిగిపోయి అంగవైకల్యులు గా మారతారు! సమస్త భారత దేశ సౌభగ్యవిభవాన్ని దోచాలని ప్రయత్నించే మీకు విప్లవ నాయకులు బుద్ది చెప్పే రోజు వస్తుంది! వీర భారతాన్ని మీ పాదాల చెంత మోకరింపచేసుకోవాలని కలలు కంటున్న మీకు మోకాళ్ళు విరిగిపోయే కాలం దాపురించింది! మీ పైశాచిక నిభందనలను మా పై రుద్ది ఊడిగం చేయించుకోవాలనుకొనే మీకు ఉసురు పొయే వేళ అసన్నమయింధి! అందుకే ఈ దుస్సాహసాలకు ఒడి గడుతున్నారు! అవివేకముతో అడుగులేస్తున్నారు!


ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం!


ఈ ఆంగ్లనీచులను ఏదుర్కొనే ఎత్తుగడలు వేయాలి! ఆధునిక ఆయుధములతో యుద్దము చేస్తున్న ఆ దుస్టులను ఎదిరించుటకు ఐకమత్యము కావాలి!


కానీ! పాంచాల కురిచ్చి ప్రజలకు ఈ యుద్దము వలన ప్రాణ నష్టము సంభవించవచ్చు! తాత్కాలికముగా ఈ శిస్తుని అంగీకరించినచో ఈ అపదనుండి నా ప్రజలను కాపాడవచ్చునేమో! లేదు! నేను అలా చేయలేను! నా ఈ నిర్ణయము నా భరత జాతిని బానిసగా మారుస్తుంది! భారత ప్రజా శక్తి పరరాజుల పాలన క్రింద నిస్తేజమై నిద్రాణమై పోకూడదు! కోట్ల ప్రజలకు నాయకత్వము వహించిన నేను ప్రాణాలకు భయపడి ఆ దుష్టులకు ఆశ్రయమివ్వరాదు! ఆ కిరాతక పరాన్న బక్షక నీచ ఆంగ్ల అధములను ఈ దేశ సరిహద్దులనుండి ప్రాలదోలాలి! విరోధుల గుండెల్లొ బెదురు పుట్టించి ఆంగ్ల రాజ్య స్థాపనకు అవరోధాన్ని కలిగించాలి! భరత ప్రజల భయంకర ఘర్జన శక్తి ఆ దుష్టులకు తెలిసి వచ్చేటట్లు చేయాలి! పరమ నీచులైన ఆ పరాసులను పరుగులు పెట్టించాలి!


అవును అదే నా కర్తవ్యము అదే నేను తీర్చుకోవలసిన మాత్రు ఋణము! నేను నా ఈ రాజ్యము ఈ స్వాతంత్ర్య పోరాటములో చేసే పోరాటమునుండి స్వంతంత్ర భారతం ఉద్భవించాలి! భారతీయులు పాంచాల వీరులను అదర్శముగా తీసుకొనేటట్లు నా సైన్యాన్ని నడిపిస్తాను! స్వాతంత్ర్య వీరుల ధైర్య సాహసాలకు భయపడి సప్తసముద్రాలు దాటి వెళ్ళి తలదాచుకొనే రోజు ఆ ఆంగ్ల అధములకు రప్పిస్తాను! ఆగ్రహావేశముతో సమూలాగ్రముగా నా జాతి ఉగ్రరూపము దాలిస్తే అగ్నిగోళాలు భగ్నమై బుగ్గిగా మారక పోవు! ఈ భరత వీరుల తీక్షణ వీక్షణతో చుక్కలు చెక్కలు ముక్కలుగా నేల రాలకపోవు! నా భరత జాతి మహొన్నత స్వేచ్చా మనోరధ మహారధ పదాల క్రింద ఆ తుచ్చుల మారాణాయుధ విదానాలు వ్రుదా కాక పోవు! నాలుగు వేల సంవత్సరములనుండి అవిచ్చన్నముగా అనర్గలముగా ప్రజ్వలముగా ప్రకాశిస్తున్న ఈ దేశ సంస్క్రుతిని కాపాడుతాను!