Sunday, January 11, 2015

అశోక చక్రవర్తి

ఆ కళింగ దేశం ఈ అశోక చక్రవర్తి ఆస్తి 
అరివీర భయంకరుడు..  శత్రువులకు సింహ స్వప్నం .. 
వైరి హృదయ విస్పోటం.. ప్రళయ కాల రుద్రుడు.. మహాగ్ని పర్వతం.. 
భువన భోంతరాలకు భయాన్ని కలిగించే భస్మాసుర హస్తం.. 
వేయి ఏనుగుల శక్తి సమన్వితమైన సమర జ్వాల... 
ఈ అశోక చక్రవర్తిని ఎదిరించి గెలవటం సాధ్యమా.. 
గెలవటమా? కనీసం బ్రతకటం సాద్యమా?
నన్ను ఎదిరించిన రాజులకు ఈ భూమి పై నూకలుండవు 
నా శాసనాన్ని దిక్కరించిన భూపతుల రక్తాన్ని తోడుతుంది నా కరవాలం 
నా సామంతునిగా మారని మహారాజు మనుగడే ప్రస్నార్దాకమవుతుంది. 
నా కనుసన్నలలో మెలగని ప్రజాదిపతులు మట్టి పాలవుతారు 
అవును 
మ్రుత్వువుకే ప్రతిరూపం ఈ అశోక చక్రవర్తి.. 
నాతో తలపడటమే అతిపెద్ద అవివేకము.. 
అటువంటిది ఎంత దైర్యం..ఎంత అహంకారం ఆ కళింగ రాజుకు.. 
కొండను డీ కొట్టిన గొర్రె పిల్లలా.. సింహంతో పోరాడిన చలి చీమలా.. 
అగ్ని పర్వతంతో ఆట లాడిన గడ్డి పోచలా.. పిడుగు పాటుతో పోటీ పడిన పిల్ల గాలిలా 
నన్ను ఎదిరించి నిలబడదామనే ఆలోచనతో.. 
దవానల సద్రుస్యమైన ఈ అశోక భూపాల చక్రవర్తి నే గెలవాలనే అడియాశతో.. అణగారి పోయాడు.. 
ఉప్పెన లాంటి నా సైన్యాన్ని తరిమేయాలనే తపనతో పాతాళానికి తొక్క బడ్డాడు.. 
ఇప్పటికి అర్దము అయ్యి ఉంటుంది తనది పగటి కల అని.. 
ఇప్పుడు సరిగ్గా బోదపడి ఉంటాయి మా సౌర్య ప్రతాపాలు.. 
ఇప్పటికి తెరుచుకొని ఉంటాయి క్రొవ్వెక్కిన అతని కనులు... 
అవును బాగా అర్దము అయి ఉంటుంది.. తాను చేసిన చారిత్రాత్మక తప్పిదం.. 
ఏమి ప్రయోజనం.. ఇప్పుడు జ్ఞానోదయమయి సాదించేది ఏముంది.. 
ముందు చూపులేని తన తెలివి తక్కువ తనానికి ఇప్పుడేమి చేయగలడు.. 
పరలోక ప్రయాణము తప్ప.. 
ఇప్పుడే తరలి వెళ్లి మా సైన్య విజయ విహార భూమిని చూసెదము.. 
ఈ ప్రపంచ చరిత్రలో మిగిలిపోయే ఆ తీర్థ స్థలాన్ని సందర్శించెదము.. 
ఏమిటి ఆ ఆక్రందనలు.. ఎక్కడివి ఆ భాదా హృదయ ఆక్రోశాలు.. ఎవరు వారు... ఎందులకు అంతటి ఆవేదన?
అవునా.. 
భర్తను పోగొట్టుకొని విలపిస్తున్న భార్య... కన్న కొడుకు కాన రాక తల్లడిల్లుతున్న తల్లి.. 
అన్న ఆధారాన్ని పోగొట్టుకొని శోకిస్తున్న చెల్లి.. తండ్రి లాలనను కోల్పోయిన కన్న బిడ్డలు.. 
కాలు విరిగి, చేయి విరిగి, నడుము కూలిపోయి.. జీవశ్చవాలు గా మారి మూల్గుతున్న సైనికులు.. 
ఏమిటి ఈ విలయ వికృత రక్త శిక విన్యాసం.. దీనికి కారకుడను నేనే కదా.. 
నేనే కదా రాజ్య కాంక్షా వ్యామోహ మదాంధుడనై..ఈ ఘోర కలికి శ్రీకారం చుట్టిన పరమ దుర్మార్గుడను.. 
నేనే కదా శవాల పునాదులపై నా విజయ సౌద నిర్మాణోత్సాహ అత్యాసాపరుడను... 
నేనే కదా లక్షల మంది చావులకు ముహూర్త రచనా నిరంకుశుడను.. 
నా కారణముగా ఎన్ని చావులు.. ఎన్ని వియోగాలు.. ఎన్ని ప్రకంపనలు.. ఎన్ని భయానక దృశ్యాలు.. 
మానవత్వం నశించిన మృగాన్ని నేను.. లేదు మృగం కంటే పరమ హీనుడను నేను.. 
ఏమి సాదించాను నేను.. ఏమి చేసుకొంటాను ఆ రాజ్య సంపదను?
అనేక మందితో తడిసిన ఆ రక్త సింహాసనం పై నేను కూర్చొన గలనా.. 
ఇదేనా ప్రజలను కాపాడవలసిన భాద్యతలో ఉన్న నేను చేయతగిన పని?
ఇదేనా నా తోటి మనుషుల సంక్షేమం కోసము జీవించ వలసిన చక్రవర్తిగా నా కర్తవ్యం?
అవును ఇది నేను చేయదగిన పనికాదు.. నా రాజ్య దాహానికి అర్దము లేదు.. నా యుద్ద కాంక్షకు నిష్కృతి లేదు.. 
నేను క్షంతవ్యుడను కాను.. నా జీవిత అర్ధాన్ని నేను వ్యర్దం చేసుకొనుచున్నాను.. నేను మారాలి.. 
ఈ ప్రపంచాన్ని యుద్ధం భారినుండి రక్షించాలి.. అమాయక ప్రజల ప్రాణాలు తీసే రాజులను మార్చాలి.. 
సామాన్యుని ఉసురు తీసి సంపాదించే రాజ్యాదికారానికి విలువ లేదని అందరికీ తెలియ చెప్పాలి.. 
నేను ఈ క్షణం నుండి ఈ ప్రపంచాన్ని శాంతి సామరస్యాల వైపు నడిపించటానికి కృషి చేస్తాను.. 
అందరిని ఆదరించే సమాజం.. మనుషులను తయారు చేసే మతం.. కన్న బిడ్డల వలే ప్రజలను పరిపాలించే నాయకులు.. 
నిజాయితీకి నిలబడే వ్యక్తిత్వం.. అహింసను అవసరంగా భావించే ఆబాల గోపాలం.. 
ఇవే నా ఆదర్శ సూత్రాలు.. వాటి మనుగడ కొరకే నా జీవితం అంకితం.. వాటి పునరుద్దరణే  నా తక్షణ కర్తవ్యం.. 
బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి..